నితీశ్ కుమార్ రాజకీయ జీవితాన్ని బీజేపీ ముగించింది: తేజస్వి యాదవ్

  • నితీశ్ కుమార్‌ను తప్పిస్తారని ముందే ఊహించామన్న తేజస్వి
  • బీహార్ ప్రజలు ఎన్నుకున్న సీఎంను తప్పించారని ఆరోపణ
  • లాలూ ప్రసాద్ యాదవ్ శిష్యుడి ఎదుగుదలను చూసి సంతోషిస్తున్నానని వ్యాఖ్య
జేడీ(యూ) అధినేత నితీశ్ కుమార్‌ను రాజకీయంగా అంతం చేయాలనుకుని లక్ష్యంగా పెట్టుకున్న బీజేపీ, ఆయనపై ఒత్తిడి తెచ్చి బీహార్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయించిందని ఆర్జేడీ వర్కింగ్ ప్రెసిడెంట్ తేజస్వి యాదవ్ ఆరోపించారు. బీజేపీ నాయకుడు సామ్రాట్ చౌదరి నేతృత్వంలోని కొత్త ప్రభుత్వం తన బలాన్ని నిరూపించుకోవడానికి ప్రత్యేక అసెంబ్లీ సమావేశాన్ని ఏర్పాటు చేసింది.

విశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా ప్రతిపక్ష నాయకుడు తేజస్వి యాదవ్ మాట్లాడుతూ, నితీశ్ కుమార్‌తో బీజేపీ బలవంతంగా ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయించిందని ఆరోపించారు. 2030 వరకు బీహార్‌లో ఎన్డీయే నాయకుడిగా నితీశ్ కుమారే ఉంటారని బీజేపీ పలుమార్లు చెప్పిందని, కానీ ఇప్పుడు ఆయనను రాజకీయంగా అంతం చేసిందని మండిపడ్డారు.

ఏ రాష్ట్రానికైనా రాజకీయ స్థిరత్వం అవసరమని, బీహార్‌లో అది కొరవడిందని అన్నారు. ఐదేళ్ళలో ఐదు ప్రభుత్వాలు మారాయని వ్యాఖ్యానించారు. నితీశ్ కుమార్‌ను తప్పిస్తారని తాము ముందే ఊహించామని అన్నారు. బీహార్ ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రిని బీజేపీ ఇప్పుడు తప్పించిందని ఆరోపించారు. సామ్రాట్ చౌదరి గతంలో ఆర్జేడీలో ఉన్నారని గుర్తు చేశారు. లాలూ ప్రసాద్ యాదవ్ శిష్యుడైన సామ్రాట్ ఎదుగుదలను చూసి తాను సంతోషిస్తున్నానని అన్నారు.

ఆరెస్సెస్ మూలాలు కలిగి ఉండి, ఎదుగుదలను చూసి అసూయపడే వారి పట్ల సామ్రాట్ చౌదరి అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సామ్రాట్ చౌదరి ఎదుగుదలను బీజేపీ అనుబంధ సంస్థ నుంచి వచ్చిన కొంతమంది స్వాగతించకపోవచ్చని తేజస్వి యాదవ్ అన్నారు.

Tejashwi Yadav
Nitish Kumar
Bihar politics
BJP
RJD
Samrat Choudhary
Bihar government
Political instability

More Telugu News